గర్హా, మే 19: జార్ఖండ్‌లోని గర్హా జిల్లాలో దారుణం చోటుచేసుకొన్నది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులు ఓ 60 ఏండ్ల వృద్ధుడిని దూషించడంతోపాటు చిత్రహింసలకు గురిచేశారు. బట్టలు విప్పదీసి, అతన్ని బైక్‌కు కట్టేసి ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత రోడ్డుపై వదిలేసి పారిపోయారు. అమ్రోరా గ్రామం సమీపంలో జరిగిన ఈ ఘటనలో బాధితుడిని సుర్స్వతి రామ్‌గా గుర్తించారు. రామ్ తన పశువుల మందను శుక్రవారం బన్సీధార్ నగర్‌కు తీసుకెళ్తున్న క్రమంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకొన్నది. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామని, వారిలో ఒకరిని అరెస్టు చేశామని పోలీసులు ఆదివారం వెల్లడించారు. మిగతా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు.