న్యూఢిల్లీ: వినియోగదారులు ప్రయాణించే ఒకే దూరానికి సంబంధించి వారు రైడ్ బుక్ చేసే సాధనాలను బట్టి వేర్వేరు చార్జీలు వసూలు చేయడంపై ఓలా, ఉబర్, ర్యాపిడో, ఇతరులకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. గమ్యస్థానం ఒకటే అయినప్పటికీ అది ఐఓఎస్ నుంచి బుక్ చేసిన వారికి ఒక రేటు, ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి రైడ్ బుక్ చేసిన వారికి మరో రేటు వసూలు చేస్తున్నారని ఈ ప్రయాణ సేవల సంస్థలపై ఆరోపణలు వచ్చాయి.
ఈ స్పష్టమైన ధర వ్యత్యాసాన్ని ప్రశ్నిస్తూ వాటి ధర నిర్ణయం విధానాలను వివరించాలని, తన నోటీస్‌లో డిమాండ్ చేసింది. మరోవైపు యాపిల్ కంపెనీకి కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) నోటీసు ఇచ్చిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం చెప్పారు. ఐఓఎస్ 18 సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత ఐఫోన్ల పని తీరులో సమస్యలు వస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు.