న్యూఢిల్లీ: దేశంలో చాలా మంది గిరిజనులకు అడవుల మీద ఉన్న హక్కులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిరాకరిస్తున్నాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరి 31 వరకు దేశవ్యాప్తంగా అటవీ హక్కుల చట్టం కింద అడవులపై తమ హక్కులను గుర్తించాలని 51 లక్షలకు పైగా దరఖాస్తులు దాఖలు కాగా వాటిలో మూడింట ఒక వంతు తిరస్కరణకు గురి కావడమే ఇందుకు నిదర్శనం.
అత్యధిక దరఖాస్తులు వచ్చిన రాష్ర్టాల్లో ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ తెలిపింది. 4 లక్షల దరఖాస్తుల తిరస్కరణతో గిరిజనుల హక్కులు నిరాకరించిన రాష్ర్టాల జాబితాలో ఛత్తీస్గఢ్ అగ్ర స్థానంలో ఉంది. అడవుల్లో నివసిస్తున్న గిరిజనులకు అక్కడి భూములపై హక్కులు ఉన్నాయని అటవీ హక్కుల చట్టం-2006 గుర్తిస్తున్నది.