భువనేశ్వర్: నెలకు రూ. 6 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రారంభించిన ఒడిశాకు చెందిన వైకుంఠనాథ్ బెహరా అక్రమాస్తుల్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. కందమాల్ జిల్లాలోని బలిగూడలోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐటీడీఏ)లో అసిస్టెంట్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఆయనపై పలు అవితీని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, భువనేశ్వర్‌లోని ప్రత్యేక న్యాయమూర్తి(విజిలెన్స్) సెర్చ్ వారెంట్ జారీ చేశారు.
విజిలెన్స్ అధికారులు తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో అధికారులు ఐదు బహుళ అంతస్థుల భవనాలు, 13 స్థలాలు, బంగారు ఆభరణాలు, బ్యాంకు లాకర్ల నుంచి రూ.రెండు కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విలువ కొన్ని కోట్లు ఉంటుందని, ఇటీవలి కాలంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఇంత భారీ మొత్తం స్వాధీనం చేసుకోవడం ఇదేనని అధికారులు తెలిపారు.