Bank | మరణించిన అక్క ఖాతాలోని డబ్బులను విత్‌డ్రా చేసేందుకు ఓ గిరిజన వ్యక్తి చేసిన పని అందర్నీ షాక్‌కు గురించింది. బ్యాంక్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన అధికారులు అర్థమయ్యేలా ప్రాసెస్ చెప్పకుండా.. ఖాతాదారుడిని తీసుకురమ్మని సతాయిచండంతో ఏకంగా అక్క అస్థిపంజరాన్నే బ్యాంక్‌కు తీసుకెళ్లాడు. ఒడిశాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని కియోంజర్ జిల్లా పట్నా బ్లాక్‌లోని దియానలి గ్రామానికి చెందిన జీతూ ముండా (50), కల్రా ముండా (56) ఇద్దరూ అక్కా తమ్ముళ్లు. కల్రా ముండాకు ఒడిశా గ్రామీణ బ్యాంకు మాలిపోసి శాఖలో కల్రా ముండాకు ఓ ఖాతా ఉంది. అయితే జనవరి 26వ తేదీన కల్రా ముండా మరణించింది. ఆ సమయానికి ఆమె ఖాతాలో రూ.20వేల నగదు ఉంది. పశువులను విక్రయించగా వచ్చిన ఆ డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఒడిశా గ్రామీణ బ్యాంకులోని తన అక్క ఖాతాలోని రూ.20వేలు విత్‌డ్రా చేసి ఇవ్వాలని జీతూ ముండా పలుమార్లు బ్యాంకుకు వెళ్లి అధికారులను కోరాడు. కానీ ఖాతాదారు వస్తేనే.. సొమ్మును విత్‌డ్రా చేయడానికి వీలవుతుందని బ్యాంక్ సిబ్బంది చెప్పారు. అప్పుడు డెత్ సర్టిఫికెట్, ఇతర డాక్యుమెంట్లు తీసుకురావాలని బ్యాంక్ అధికారులు జీతూకు సూచించారు. అయితే నిరక్షరాస్యుడైన జీతూకు అర్థమయ్యేలా చెప్పలేదు. సరైన ప్రాసెస్ చెప్పకుండా రుసురుసలాడుతూ చెప్పడంతో.. ఏం చేయాలో అర్థం కాక.. జీతూ రెండు నెలల క్రితం చనిపోయిన తన అక్క అస్థిపంజరాన్ని ఏకంగా బ్యాంక్‌కు తీసుకొచ్చాడు.
జీతూ సమాధిని తవ్వి అందులో నుంచి తన అక్క అస్థిపంజరాన్ని బయటకు తీశాడు. దాన్ని ఒక బట్టలో చుట్టుకుని మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంక్‌కు తీసుకొచ్చాడు. అది చూసిన బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాగా జీతూ మాట్లాడుతూ.. ” నా అక్క మరణించిందని బ్యాంక్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఆమెను తీసుకొస్తేనే డబ్బు ఇస్తామని చెబుతున్నారు. అందుకే ఏం చేయాలో పాలుపోక సమాధిని తవ్వి అక్క అస్థిపంజరాన్ని తీసుకొచ్చాను ” అని జీతూ ముండా తెలిపారు.
అస్థిపంజరంతో జీతూ ఆస్పత్రికి రావడం చూసి భయపడిపోయిన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. జీతూ నిరక్షరాస్య గిరిజనుడు. నామినీ, చట్టబద్ద వారసులు వంటి అంశాలు అతనికి తెలియవు. ఈ విషయాలను అర్థమయ్యేలా బ్యాంక్ అధికారులు వివరించలేదు అని పోలీసులు తెలిపారు. అందువల్లే అస్థిపంజరాన్ని తీసుకొచ్చాడని పేర్కొన్నారు. కాగా, జీతూకు సహాయం చేస్తామని.. తన అక్క ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించి ఇస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అనంతరం అస్థిపంజరాన్ని సమాధి వద్ద పూడ్చేశారు.
ఇక కల్రా ముండా ఖాతాలో నమోదైన నామినీ కూడా మరణించారని.. జీతూ ముండా ఒక్కరే ఆమెకు మిగిలిన వారసుడు అని బ్యాంక్ అధికారులు తెలిపారు.