భువనేశ్వర్ : ఓ ప్రైమరీ స్కూల్ టీచర్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా రూ. 4.73 కోట్ల ఆస్తులను గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. రాయగడ జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్లో శిశిర్ కుమార్ అనే వ్యక్తి టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఆ టీచర్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్కు చెందిన నలుగురు డీఎస్పీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లతో పాటు పలువురు అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి పలుచోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. దాడుల్లో భాగంగా 4.73 కోట్ల ఆస్తులను గుర్తించారు. మూడంతస్తుల భవనాలు రెండు, రెండు అంతస్తుల భవనాలు మూడింటిని గుర్తించారు.
రూ. 21.68 లక్షల డిపాజిట్లను గుర్తిచి సీజ్ చేశారు. ఇన్నోవా, బొలేరో వాహనంతో పాటు 408 గ్రాముల బంగారం, 229 గ్రాముల వెండి ఆభరణాలను గుర్తించారు. రూ. 2,83,342 విలువ చేసే ఇన్సూరెన్స్ డిపాజిట్లు ఉన్నాయి. శిశిర్ కుమార్ బంధువుల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.