కోత్కత, అక్టోబర్ 11: పశ్చిమబెంగాల్ ఆర్జీకర్ లైంగికదాడి ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. బర్ధమాన్ జిల్లాలో ఒడిశాకు చెందిన ఓ వైద్య కళాశాల విద్యార్థినిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాల క్యాంపస్ వెలుపల శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భోజనం చేసేందుకు ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన స్నేహితులతో కలసి బయటకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
కళాశాల దవాఖానలో చికిత్స పొందుతున్న ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన బాధితురాలు పోలీసులకు వాంగ్మూలాన్ని ఇచ్చినట్లు ఓ అధికారి చెప్పారు. గత ఏడాది కోల్‌కతాలోని ఆర్జీ కర్ దవాఖానలో ఓ పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన జరిగిన నేపథ్యంలో జరిగిన తాజా ఘటన రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలనలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయనడానికి నిదర్శనమని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై అధికార టీఎంసీ స్పందిస్తూ ఇటువంటి విషయాలను రాజకీయం చేయడం తగదని పేర్కొంది.
దుర్గాపూర్ కమిషనరేట్ డిప్యుటీ కమిషనర్(తూర్పు) అభిషేక్ గుప్తా అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇది చాలా సున్నిమైన అంశమని, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మరింత సమాచారం లభించిన తర్వాత వాటిని మీడియాకు తెలియచేస్తామని తెలిపారు. తమ కుమార్తె స్నేహితుల నుంచి ఫోన్ కాల్ రాగానే నేటి ఉదయం దుర్గాపూర్ చేరుకున్నామని వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపారు. భోజనం చేసేందుకు తన మిత్రులలో ఒకరితో కలసి కళాశాల క్యాంపస్ నుంచి వెలుపలికి వెళ్లిన తన కుమార్తెపై శుక్రవారం రాత్రి సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలి తల్లి ఆరోపించారు. నేటి ఉదయం దుర్గాపూర్ చేరుకున్న తర్వాత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఆమె చెప్పారు. చదువుల పరంగా కాలేజీకి మంచి పేరుందని, అందుకే తమ కుమార్తెను ఇక్కడ మెడిసిన్‌లో చేర్పించామని బాధితురాలి తండ్రి చెప్పారు.
శుక్రవారం రాత్రి 8-8.30 గంటల ప్రాంతంలో విద్యార్థిన తన ఫ్రెండ్‌తో కలసి క్యాంపస్ బయటకు వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని దుర్గాపూర్‌లోని న్యూ టౌన్షిప్ పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడకు వచ్చిన తర్వాత ఆమెను ఒంటరిగా వదిలి ఆ ఫ్రెండ్ పారిపోయినట్లు ఆయన చెప్పారు. ఆమె ఫోన్‌ని లాక్కున్న ఆ వ్యక్తులు క్యాంపస్ వెలుపల ఉన్న అడవిలోకి ఆమెను తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేశారని ఆ అధికారి తెలిపారు. దీని గురించి బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమెను బెదిరించారని ఆయన చెప్పారు. మొబైల్ ఫోన్ వాపసు చేయడానికి ఆమె నుంచి డబ్బు కూడా వారు డిమాండు చేసినట్లు తెలిపారు. బాధితురాలి ఫ్రెండ్‌తో గత రాత్రి మాట్లాడామని, సీసీటీవీ ఫుటేజ్ కోసం ప్రయత్నిస్తున్నామని ఆ అధికారి చెప్పారు.
సామూహిక అత్యాచారానికి గురైన మెడిసిన్ విద్యార్థినిని, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) బృందం శనివారం దుర్గాపూర్ చేరుకుంది. బెంగాల్లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని, అటువంటి కేసులలో పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు అర్చనా మజుందార్ చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమని, మహిళలపై నేరాలను అదుపు చేసేందుకు తమతో కలసి పనిచేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తాము కోరతామని ఆమె తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండు చేస్తూ బీజేపీ కార్యకర్తలు శనివారం న్యూ టౌన్షిప్ పోలీసు స్టేషన్ వెలుపల ధర్నా చేపట్టారు.