భువనేశ్వర్: ఒడిశాలోని బాలంగిర్ జిల్లాలో 9వ తరగతి విద్యార్థికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. జిల్లాలోని అగల్పూర్ బాలుర ఉన్నత పాఠశాలలో వార్షిక స్పోర్ట్స్ మీట్ జరుగుతున్నది. ఇందులో భాగంగా విద్యార్థులు జావెలిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థి జావెలిన్‌ను విసిరాడు. అయితే అది ప్రమాదవశాత్తు 9వ తరగతి చదువుతున్న సదానంద్ మెహర్ అనే విద్యార్థి మెడకు గుచ్చుకున్నది. జావెలిన్ మెడలోకి చొచ్చుకెళ్లడంతో వెంటనే పాఠశాల యాజమాన్యం అతడిని దవాఖానకు తరలించారు.
ప్రస్తుతం సదానంద్ పరిస్థితి బాగానే ఉందని, ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. జావెలిన్‌ను అతని మెడ నుంచి తొలగించారని తెలిపారు. కాగా, బాధితుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సదానంద్‌కు మెరుగైన వైద్య సాయం సీఎం నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు. అతడు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుచి అందజేస్తామని తెలిపారు.