లక్నో : వారణాసిలోని (UP) పవిత్ర గంగా నది ఒడ్డున మణికర్ణిక ఘాట్‌లో మహిళలతో అశ్లీల నృత్యాల ప్రదర్శన వివాదాస్పదమైంది. మహాశంషాన్ నాధ్ బాబా మూడు రోజుల వార్షిక కార్యక్రమం చివరి రోజున మంగళవారం రాత్రి ఈ ప్రదర్శన నిర్వహించారు. స్మశాన వాటికల్లో మణికర్ణిక ఘాట్‌ను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంటారు. ఎంతోమంది తమ జీవితంలో తుది అంకాన్ని ఈ ఘాట్‌లో గడిపాలని ఎందరో వృద్ధులు కోరకుంటారు. ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతుంటారు.
ఇంతటి పవిత్రత కలిగిన మణికర్ణిక ఘాట్‌లో మహిళలతో అశ్లీల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. డ్యాన్స్ ప్రదర్శనను వీక్షించే వారు మహిళా డ్యాన్సర్లపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. డ్యాన్స్ ప్రోగ్రాంకు లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడంతో స్మశాన వాటికలో ప్రశాంతతకు భగ్నం వాటిల్లింది. సంప్రదాయం పేరిట అశ్లీల నృత్యాలు చేయడం తగదని పలువురు విమర్శలు గుప్పించారు.
తమ ఆత్మీయులను కోల్పోయిన వారంతా ఘాట్‌ను సందర్శించే క్రమంలో ఇక్కడ అశ్లీల నృత్య ప్రదర్శన సరైంది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అశ్లీల నృత్య ప్రదర్శనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్మశానవాటిక నిర్వాహకులు గుల్షన్ కపూర్ పేర్కొనడం గమనార్హం.
జిల్లా అధికారుల నుంచి అనుమతి ఉందా అని ప్రశ్నించగా రాత్రి పది గంటల తర్వాత లౌడ్ స్పీకర్లను ఎప్పటి నుంచో వాడుతున్నారని సమాధానం దాటవేశారు. డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు రాత్రి వేళే జరుగుతాయని బదులిచ్చారు.పవిత్ర గంగానదీ తీరంలోని మణికర్ణిక ఘాట్‌లో అశ్లీల నృత్యాలపై స్ధానికులు, భక్తులు అధికారుల తీరును తప్పుపడుతున్నారు.