ముంబై: నటుడు అజాజ్ ఖాన్(Ajaz Khan), నిర్మాత రాజ్‌కుమార్ పాండేపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హౌజ్ అరెస్టు వెబ్ షోలో అశ్లీల కాంటెంట్ ప్రసారం చేసిన నేపథ్యంలో వారిపై కేసు బుక్ చేశారు. అజాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్.. ఉల్లు యాప్‌లో ప్రసారం అవుతున్నది. భజరంగ్ దళ్‌కు చెందిన కార్యకర్త గౌతమ్ రవ్రియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతనిపై కేసు బుక్ చేశారు.
వెబ్ షోలో అశ్లీల భాషలో కాంటెంట్ ఉన్నట్లు గుర్తించారు. మహిళలను కించపరిచే రీతిలో దృశ్యాలు ఉన్నట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అనేక మంది ఆ షోకు చెందిన అశ్లీల దృశ్యాలను తమకు షేర్ చేస్తున్నారని ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి పేర్కొన్నారు.
భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద హౌజ్ అరెస్టు నిర్మాత, నటులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. షోకు చెందిన కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షోలో పాల్గొనే కాంటెస్టాంట్లపై వత్తిడి చేస్తున్నట్లు దృశ్యాలు ఉన్నాయి. మహిళల్ని కూడా వత్తిడి చేసే దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. పోటీలో పాల్గొన్నవారిని కొన్ని అసభ్యకరమైన ప్రశ్నలు వేసినట్లు కూడా ఉంది.
హౌజ్ అరెస్టు వెబ్ షోను తక్షణమే బ్యాన్ చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ చిత్రా వాఘా డిమాండ్ చేశారు. ఆ షోలో ఉన్న కాంటెంట్.. సమాజానికి, పిల్లలపై ప్రభావం చూపిందన్నారు. ఇలాంటి షోలను ప్రసారం చేసే మొబైల్ అప్లికేషన్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆమె కోరారు.