ముంబై, మే 31: సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలేపై ఇండిక్ టేల్స్, హిందూ పోస్ట్ అనే వెబ్సైట్లలో వచ్చిన వ్యాసాలు మహారాష్ట్రలో ఆందోళనలకు కారణమయ్యాయి. మహిళలకు విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే గురించి అభ్యంతరకర వ్యాసాలను నిరసిస్తూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేతలు బుధవారం ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
ఆ పార్టీ సీనియర్ నేతలు అజిత్ పవార్, జయంత్ పాటిల్, సునిల్ తట్కరే, ఛగన్ భుజ్బల్ తదితరులు ఈ రెండు వెబ్సైట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం సైతం స్పందించింది. మహనీయులకు వ్యతిరేకంగా అభ్యంతరకంగా రాసిన వారిని వదలబోమని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. ఈ వ్యాసాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.