చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే మాజీ కోఆర్డినేటర్ ఓ పన్నీరుసెల్వం(O. Panneerselvam).. ఎన్డీఏ కూటమితో ఉన్న అనుంబంధాన్ని తెంచుకున్నారు. ఎన్డీఏ నుంచి వీడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మార్పు చోటుచేసుకోవడానికి పూర్వం.. ఇవాళ ఉదయం తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పన్నీరుసెల్వం భేటీ అయ్యారు. చెన్నైలోని థియోసోఫికల్ సొసైటీలో స్టాలిన్ మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఆయన్ను పన్నీరుసెల్వం కలిశారు.
ఇటీవల ప్రధాని మోదీ తమిళనాడులోని చోళపురం విజిట్ చేశారు. ఆ సమయంలో ఆయనతో భేటీకీ ఓపీఎస్ అపాయింట్మెంట్ కోరారు. కానీ మోదీని కలిసేందుకు ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో.. కేంద్ర ప్రభుత్వాన్ని పన్నీరుసెల్వం విమర్శించారు. సర్వశిక్షా అభియాన్ నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి ఓపీఎస్ వైదొలిగిన విషయాన్ని మాజీ మంత్రి పన్రుటి రామచంద్రన్ ద్రువీకరించారు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాని కోసం త్వరలో ఓపీఎస్ రాష్ట్రవ్యాప్తంగా టూర్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
విజయ్‌కు చెందిన తమిళ వెట్రి కజగం పార్టీతో పన్నీరుసెల్వం జత కట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.