O. Panneerselvam : మరో రెండు నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. తాజాగా.. ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన కీలక నేత ఓ పనీర్ సెల్వం.. తిరిగి తాను ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే, ఆయన ప్రతిపాదనను ఏఐఏడీఎంకే అగ్రనేత పళనిస్వామి తిరస్కరించారు. అతడికి పార్టీలో స్థానం లేదన్నారు.
ఏఐఏడీఎంకే పార్టీలో గతంలో పనీర్ సెల్వం, పళని స్వామి రెండు రెండు వేర్వేరు గ్రూపులు ఉండేవి. ఈ క్రమంలో 2023లో పనీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటినుంచి ఆయనకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం దొరకడం లేదు. మూడుసార్లు తమిళనాడు సీఎంగా చేసినప్పటికీ సొంతంగా అంతగా బలమైన నాయకుడు కూడా కాదు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలంటే ఏదైనా పార్టీ మద్దతు చాలా అవసరం. అందుకే తిరిగి సొంతగూటికి (ఏఐఏడీఎంకే)లోకి చేరాలని ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో మదురైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయనను మీడియా ప్రశ్నించగా.. తాను తిరిగి ఏఐఏడీఎంకేలో చేరేందుకు సిద్ధమేనని, కానీ, ఆ పార్టీ అందుకు సిద్ధంగా ఉందా అని ప్రశ్నించాడు. దీనిపై ఏఐఏడీఎంకే అగ్రనేత పళనిస్వామి స్పందించారు. పనీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించామని, పార్టీ సభ్యత్వం కూడా లేదని, ఆయనను తిరిగి పార్టీలోకి చేర్చుకునే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు.
ప్రస్తుతం 75 ఏళ్ల వయసున్న పనీర్ సెల్వం తిరిగి రాజకీయాల్లో రాణించడం కష్టమేనని తమిళనాడు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు పక్క టీవీకే పేరుతో నటుడు విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టగా.. ఇటు అధికార డీఎంకేకు స్టాలిన్, ఉదయనిధి వంటి నేతులున్నారు. ఏఐఏడీఎంకేలో నాయకత్వ లోపం ఉంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్వల్పం. బీజేపీతో కలిసి మెరుగైన సీట్లు సాధించానలి మాత్రం పట్టుదలగా ఉంది.