న్యూఢిల్లీ: అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యమున్న అగ్ని- 4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ ద్వీపం నుంచి సోమవారం రాత్రి 7.30 గంటలకు ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 4,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యమున్న మధ్యంతర రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని రొటీన్ శిక్షణలో భాగంగా స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో పరీక్షించినట్లు పేర్కొంది. అగ్ని 4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష అన్ని ఆపరేషన్ల పరిమితులను చేరుకున్నదని, ప్రయోగ వ్యవస్థ విశ్వనీయత, సామర్థ్యాన్ని చాటిందని వివరించింది. విజయవంతమైన ఈ పరీక్ష, కనీస నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉండాలనే భారతదేశ విధానాన్ని పునరుద్ఘాటించినట్లు వెల్లడించింది.
కాగా, అణు సామర్థ్యం కలిగిన అగ్ని ప్రైమ్ క్షిపణిని గత ఏడాది ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించారు. 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే సత్తా దీనికి ఉంది. మరోవైపు వ్యూహాత్మక క్షిపణులను మరింతగా అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టి సారించింది. దీని కోసం ఆధునాతన సాంకేతికతను సమకూర్చుకుంటున్నది.