న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు సంబంధించి యూజీసీ-నెట్ 2026 పరీక్షలను తిరిగి నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించిన మరుసటి రేజే ఏజెన్సీ చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐతోపాటు ఇతర విద్యార్థి సంఘాలు సోమవారం ఇక్కడి ఎన్టీఏ కార్యాలయం వెలుపల నిరసన చేపట్టాయి. ఎన్టీఏను రద్దు చేయాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. యూజీసీ నెట్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఐఎస్ఏ, ఆరోపణలపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేసింది. ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ, మొత్తం ప్రక్రియ నిర్వహణలో పాలుపంచుకున్న వారి పాత్రలపై విచారణ జరుపాలని డిమాండ్ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు లేదా ఇందులో భాగస్వాములైనట్టు తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఏ డిమాండ్ చేసింది. ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీ కూడా ఎన్టీఏకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది.