న్యూఢిల్లీ, జూలై 17 : నీట్-యూజీ 2026 రీఎగ్జామ్‌లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. 8 మంది తెలంగాణ విద్యార్థులు 690కిపైగా స్కోర్ సాధించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఫలితాలను ఎన్టీఏ గురువారం రాత్రి ప్రకటించింది. తుది సమాధానాల కీని విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఫలితాల్ని విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను neet.nta.nic.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
రీఎగ్జామినేషన్‌కు దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, 11.21 లక్షల మంది అడ్మిషన్లకు అర్హత సాధించినట్టు ఎన్టీఏ తెలిపింది. దీంట్లో 58శాతంపైగా మహిళా అభ్యర్థులు ఉన్నారని తెలిపింది. మొత్తం 720 మార్కులకుగాను 705కుపైగా మార్కులు సాధించి 17 మంది టాపర్లుగా నిలిచారు. ఈ జాబితాలో తెలంగాణ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు విద్యార్థులు ఉన్నారు. పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పన్షుల్ బన్సల్ ఇద్దరూ 715 మార్కులతో జాతీయ స్థాయిలో టాప్‌లో నిలిచారు.
