JEE Main 2026 | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలు జనవరి, ఏప్రిల్లో రెండు సెషన్లో జరుగనున్నది. తొలి సెషన్ జనవరి 21 నుంచి 30 మధ్య జరుగనుండగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్లో ప్రారంభం కానుంది. అభ్యర్థులు jeemain.nta.nic.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పింది. ఏప్రిల్ ఒకటి నుంచి 10 మధ్య రెండో సెషన్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. అయితే, పరీక్షలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను త్వరలోనే ప్రకటించనున్నది.
వచ్చే ఏడాది ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పలు చర్యలు తీసుకుంది. పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో ఎగ్జామ్స్ నగరాల సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టింది. అభ్యర్థులు ఎక్కువగా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా కేంద్రాలను పెంచబోతున్నది. దివ్యాంగులైన అభ్యర్థులు పరీక్షను సౌకర్యవంతంగా రాసేందుకు అవసరాలను తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇదిలా ఉండగా.. జేఈఈ పరీక్షను సజావుగా నిర్వహించడంలో భాగంగా అర్హత కలిగిన అభ్యర్థులంతా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే ముందుగానే అవసరమైన అన్ని పత్రాలను అప్డేట్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. దాంతో దరఖాస్తుల ప్రక్రియ, తదుపరి దశల్లో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని.. దరఖాస్తుల తిరస్కరణతో పాటు పలు సమస్యలు ఉత్పన్నం కావని చెప్పింది.
ఆధార్లో అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫొటో, చిరునామా సరిచూసుకోవాలని.. ఆధార్లో ఏవైనా మార్పులుంటే ఉడాయ్ మార్గదర్శకాలు పాటించాలని చెప్పింది. ఆధార్లో పేరు, పుట్టిన తేదీ (10వ తరగతి సర్టిఫికెట్) సరిగా ఉండేలా అప్డేట్ చేసుకోవాలి. అలాగే, తాజా ఫొటో, చిరునామా, తండ్రి పేరు ఇలా అన్ని వివరాలు మీ కార్డులో అప్డేట్ ఉండేలా చూసుకోవాలి. దివ్యాంగులైతే యూడీఐడీ కార్డు చెల్లుబాటు అవుతుందని.. అయితే, రెన్యువల్ చేయించుకొని అప్డేట్ చేయించడం తప్పనిసరని పేర్కొంది. కేటగిరీ సర్టిఫికెట్ చెల్లుబాటయ్యేలా చూసుకోవాలని కోరింది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు www.nta.ac.in, jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్లను చెక్ చేస్తూ ఉండాలని.. అప్పుడే పరీక్షలకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవచ్చని ఎన్టీఏ డైరెక్టర్ పేర్కొన్నారు.