జైపూర్: నేషనల్ సెక్యూర్టీ గార్డులో కమాండో(NSG Commando)గా చేసిన బజరంగ్ సింగ్ ఇప్పుడు డ్రగ్ స్మగ్లింగ్ రాకెట్ నిర్వహిస్తున్నాడు. ముంబైలో జరిగిన సెప్టెంబర్ 26 దాడుల సమయంలో అతను ఎన్ఎస్జీ కమాండో పాత్రను పోషించాడు. కానీ ప్రస్తుతం రాజస్థానీ పోలీసులకు ఓ డ్రగ్ రాకెట్ సూత్రధారిగా దొరికిపోయాడు. బుధవారం అతన్ని చురులో రాజస్థానీ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆ కమాండో గంజాయి స్మగ్లింగ్ చేసి రాజస్థాన్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించామని ఐజీ వికాశ్ కుమార్ తెలిపారు. మాజీ కమాండో నుంచి సుమారు 200 కిలోల నిషేధిత డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతని స్వస్థలం సికర్ జిల్లా. పోలీసులు అతనిపై చాన్నాళ్ల నుంచి నిఘా పెట్టారు. అతనిపై 25 వేల రివార్డు కూడా ఉన్నది. సింగ్‌ను పట్టుకునేందుకు రాజస్థానీ పోలీసులకు రెండు నెలల సమయం పట్టింది. ఆపరేషన్ గాంజానే పేరుతో ప్రత్యేకంగా అతనిపై నిఘా పెట్టారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
బజరంగ్ సింగ్ కేవలం పదో తరగతి వరకే చదువుకున్నాడు. కానీ ఆరు అడుగుల ఎత్తు, బలమైన ఫిట్నెస్ కారణంగా అతను బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్‌కు ఎంపికయ్యాడు. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా అతను పంజాబ్, అస్సాం, రాజస్థాన్, ఒడిశా, బెంగాల్లో పనిచేశాడు. చొరబాటుదారులు, మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. దేశ రక్షణ కోసం అతను అమితమైన విధేయతను చూపించాడు. సెక్యూర్టీ ఆఫీసర్లు దృష్టిలో పడ్డాడతను. ఎన్ఎస్జీ కోసం సెలక్ట్ అయ్యాడు. ఏడేళ్ల పాటు అతను ఎన్ఎస్జీ కమాండోగా చేశాడు. ఎన్ఎస్జీలో ఉన్న సమయంలోనే.. 2008 ముంబై దాడుల ఘటన జరిగింది. ఆ ఆపరేషన్‌లో బజరంగ్ పాల్గొన్నాడు.
2021లో అతను రాజకీయాల్లో క్రీయాశీలంగా వ్యవహించాడు. రాజస్థాన్‌లోని స్వగ్రామంలో ఓ పార్టీ తరపున వర్కర్‌గా చేశాడు. భార్యను గ్రామ స్థాయి ఎన్నికల్లో నిలబెట్టాడు. కానీ ఆమె ఆ ఎన్నికల్లో ఓడింది. ఒకప్పుడు దేశ సరిహద్దులను రక్షించిన కమాండో బజరంగ్ సింగ్.. ఆ తర్వాత డ్రగ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డాడు. రాజకీయాల్లో ప్రవేశించాక అతనికి క్రిమినల్ లింక్స్ దొరికాయి. గంజాయి వ్యాపారంతో డబ్బు సంపాదించవచ్చు అన్న ఆశ పుట్టింది. తనకు ఉన్న పాత పరిచయాలతో అతను ఒడిశా, తెలంగాణలో గాంజాయి స్మగ్లర్లతో లింకులు పెట్టుకున్నాడు. ఏడాదిలోనే గంజాయి సిండికేట్ నడిపించాడు.
అతనిపై చాలా కేసులు నమోదు అయ్యాయి. 2023లో హైదరాబాద్ లో రెండు క్వింటాళ్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. గత రెండు నెలల నుంచి ఏటీఎస్, ఏఎన్టీఎఫ్ దళాలు సింగ్ కోసం గాలిస్తున్నాయి. గంజాయి వ్యాపారం చేస్తున్న మాస్టర్‌మైండ్స్ కోసం వేట సాగించారు. అయితే గంజాయి స్మగ్లింగ్ నిర్వహిస్తోంది సింగ్ అని రాజస్థానీ పోలీసులు ఆలస్యంగా తెలుసుకున్నారు. ఫేక్ మొబైల్ ఐడీలు వాడుతూ, మారుమూల గ్రామాల్లో దాచుకున్నాడు. వంట మనిషి ఇచ్చిన సమాచారం ఆధారంగా మాజీ కమాండో బజరంగ్ సింగ్‌ను అరెస్టు చేశారు.