కోటా (రాజస్థాన్): రాజస్థాన్‌లోని బూందీ ప్రాంత 26వ రాజుగా ఎన్ఎస్జీ కమాండర్ బ్రిగేడియర్ భూపేశ్ సింగ్ హాడా సింహాసనాన్ని అధిష్ఠించారు. రాజా రంజిత్ సింగ్ మరణం తర్వాత 2010 నుంచి ఈ సింహాసనం ఖాళీగానే ఉన్నది. ఆయనకు వారసులు లేకపోవటంతో 11 ఏండ్ల అనంతరం హాడాను రాజుగా పాగ్ కమ్యూనిటీ ఎన్నుకొన్నది. కమ్యూనిటీలోని మొత్తం 118 మంది మాజీ జాగీర్దార్లు, తికనేదార్లలో 108 మంది హాడా నాయకత్వాన్ని బలపరిచారు. దీంతో ఆదివారం సంప్రదాయం ప్రకారం హాడాను సింహాసనంపై కూర్చోబెట్టారు. అనంతరం తనకు భారత ప్రభుత్వం ఇచ్చిన శౌర్యచక్ర, విశిష్ట సేవా మెడల్స్‌ను ధరించి స్థానిక ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం అదృష్టమని, వారి కోసం నా ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు.