NSE phone tapping case | నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఫోన్ ట్యాపింగ్ కేసులో ముంబై నగర మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఉద్యోగుల ఫోన్లను చట్ట విరుద్ధంగా సంజయ్ పాండే ట్యాప్ చేశారని ఈడీ అభియోగం. 1986-బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ మాజీ ఐపీఎస్ అధికారిని ఏడు గంటలకు పైగా విచారించిన తర్వాత ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది.
అంతకుముందు సోమవారం కూడా సంజయ్ పాండేను ఈడీ అధికారులు ప్రశ్నించారు. వరుసగా మంగళవారం పాండేను విచారించిన ఈడీ అధికారులు చివరకు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. గత నెల 30న ఐపీఎస్ అధికారిగా రిటైర్ అయ్యారు. నాలుగు నెలల పాటు ముంబై నగర పోలీస్ కమిషనర్‌గా పని చేసిన సంజయ్ పాండే.. కొంతకాలం మహారాష్ట్ర తాత్కాలిక డీజీపీగా కూడా సేవలందించారు.
ఇదే కేసులో ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను గతవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంజయ్ పాండే సీబీఐతోపాటు ఈడీ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. తన సొంత కంపెనీ ఐ-సెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సెబీ నిబంధనలను ఉల్లంఘించి ఎన్ఎస్ఈ ఉద్యోగుల ఫోన్లు ట్యాప్ చేశారని సంజయ్ పాండేపై ఆరోపణ.