న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ప్రత్యేక జెండా, రాజ్యాంగం కోసం తాము చేస్తున్న డిమాండ్లను అంగీకరించాల్సిందేనని ఎన్ఎస్సీఎన్-ఐఎం(నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఇసాక్-ముయివా) సిద్ధాంతకర్త ఆర్‌హెచ్ రాయ్‌సింగ్ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. లేకపోతే శాంతి చర్చల నుంచి నిష్క్రమిస్తామని ఆయన హెచ్చరించారు. మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో ఈ నెల 25న నాగా నేతలు నిర్వహించిన ప్రజా సంప్రదింపుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము డిమాండ్ చేస్తున్న ప్రత్యేక జెండా అంశం తుది దశలో ఉన్నదని, ప్రత్యేక రాజ్యాంగానికి సంబంధించిన అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రెండు డిమాండ్లకు నరేంద్రమోదీ సర్కారు అంగీకరించకపోతే కాల్పుల విరమణ నుంచి నిష్క్రమించేందుకు ఎన్ఎస్సీఎన్-ఐఎం సిద్ధంగా ఉన్నదని రాయ్‌సింగ్ స్పష్టం చేసినట్టు ‘సంగై ఎక్స్‌ప్రెస్’ పత్రిక వెల్లడించింది.