NRI : అమెరికా (USA) లో 23 ఏళ్లుగా నివసిస్తూ అత్యంత విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఓ ఎన్నారై (NRI) స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. సుమారు రూ.56 కోట్ల విలువైన సంపదను కూడబెట్టినప్పటికీ ఆ దేశంలో తాను ఇప్పటికీ ఒక ‘పరాయివాడినే’ అనే భావన వెంటాడుతోందని, మనశ్శాంతి లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా (Social Media) లో పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్ (Internet) లో వైరల్‌గా మారి, ప్రవాస భారతీయుల జీవితాల్లోని మరో కోణాన్ని తెలియజెప్పింది.
ఎన్నారై తన రెడ్డిట్ పోస్ట్‌లో.. ‘నేను మొదట అమెరికాకు వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా ఫీలయ్యాను. ప్రపంచం నడిబొడ్డున అడుగుపెట్టినట్లు అనిపించింది. నేను భారతదేశంలో పెరిగిన ప్రదేశంతో పోలిస్తే.. ఇక్కడి మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు ఎంతో ఉన్నతంగా అనిపించాయి. సంపాదనలో ఎక్కువ భాగం జీతం, ఈక్విటీ కాంపెన్సేషన్, అమెరికన్ టెక్ స్టాక్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా వచ్చాయి. ఈరోజు నా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో విలువ సుమారు 6 మిలియన్ డాలర్లు. దీనికి అదనంగా మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి’ అని అతను పేర్కొన్నారు.
అయితే ఇంత సంపద ఉన్నప్పటికీ భారత్‌కు తిరిగి వెళ్లాలనే ఆలోచన ఆర్థికపరమైనది కాదని స్పష్టంచేశారు. ఇన్నేళ్లయినా తాను ఇక్కడ అప్పుడప్పుడు పరాయివాడిలాగే భావిస్తున్నానని చెప్పారు. మాటల్లో చెప్పలేని ఒక అదృశ్య దూరం వెంటాడుతూనే ఉందని అన్నారు. నేను ఎంత సాధించినా ఈ ప్రదేశంలో పూర్తిగా భాగం కాలేకపోతున్నాననే భావన కలుగుతోందని తన ఆవేదనను పంచుకున్నారు. వయసు పైబడ్డాక అమెరికాలో నా జీవితం ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నానని, కుటుంబ బంధాలు, సామాజిక మద్దతు, మానసిక భద్రత వంటి విషయాల్లో నాకు ఇక్కడ పూర్తిస్థాయి భరోసా దొరుకుతుందనే నమ్మకం లేదని పేర్కొన్నారు. నా సొంత దేశంలో లభించే సౌకర్యాన్ని ఇక్కడ అనుభవించగలనో లేదోననిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ.. సొంత ఊరిలో దొరికే ఆనందం మరెక్కడా దొరకదని కామెంట్ చేశారు. ‘వెళ్లిపో బ్రదర్. బాగా సంపాదించావు. 6 మిలియన్ డాలర్లు చిన్న విషయం కాదు. నీ రిటైర్మెంట్ జీవితాన్ని ఆనందంగా గడుపు’ అని ఒకరు రాశారు. మరికొందరు ఆచరణాత్మక సలహాలు ఇచ్చారు. ‘మీరు ఎక్కడ నివసించినా, కష్టసుఖాలు పంచుకోవడానికి స్నేహితులు, కుటుంబం ముఖ్యం. అదే అసలైన బంధం’ అని ఒకరు పేర్కొన్నారు. ’23 ఏళ్లలో భారత్ చాలా మారిపోయింది. ఏడాదికి రెండు వారాలు వచ్చి వెళ్లడం వేరు, శాశ్వతంగా ఇక్కడే ఉండటం వేరు. తుది నిర్ణయం తీసుకునే ముందు ఓ ఆరు నెలలపాటు భారత్‌లో గడిపి చూడండి’ మరో యూజర్ సూచించారు.