Sammed Shikhar | దేశవ్యాప్తంగా జైనులు చేస్తున్న ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. జైనుల పుణ్యక్షేత్రం సమ్మేద్ శిఖర్ను పర్యాటక ప్రదేశం జాబితా నుంచి తొలగించింది. జైన్ కమ్యూనిటీ నుంచి వచ్చిన డిమాండ్‌కు అంగీకరించిన కేంద్రం.. ఈ మేరకు పర్యావరణ పర్యాటక పనులను నిషేధించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమ్మేద్ శిఖర్ను పర్యాటక ప్రాంతం జాబితా నుంచి తొలగించడం పట్ల జైనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జైన్ కమ్యూనిటీ పెద్దలతో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ భేటీ అయిన అనంతరం ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
జార్ఖండ్‌లోని పరస్నాథ్లోని ఎత్తైన పర్యతంపై ఉన్న జైన పుణ్యక్షేత్రమే సమ్మేద్ శిఖర్. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతం జాబితా నుంచి తొలగించారు. మూడేండ్ల క్రితం జారీ చేసిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం గురువారం ఉపసంహరించుకున్నది. ఇక్కడ అన్ని టూరిజం, ఎకో టోరిజం కార్యకలాపాలను నిషేధించాలని సూచిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొన్నది. సమ్మేద్ శిఖర్ను పర్యావరణ సున్నిత ప్రాంతంగా 2019 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత జార్ఖండ్ ప్రభుత్వం జిల్లా యంత్రాంగం సిఫార్సు మేరకు దీనిని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తూ తీర్మానం లేఖను జారీ చేసింది. గిరిదిహ్ జిల్లా యంత్రాంగం ఇక్కడ పౌర సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్‌ను కూడా సిద్ధం చేసింది.
గురువారం మధ్యాహ్నం పలువురు జైన మతపెద్దలు కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్‌తో భేటీ అయ్యారు. తమకు చెందిన పుణ్యక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడంపై వారు తమ నిరసన వ్యక్తం చేశారు. దాంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు అంగీకరించింది. సమ్మేద్ శిఖర్‌తో సహా జైన సమాజంలోని అన్ని మతపరమైన ప్రదేశాలలో జైనుల హక్కులను పరిరక్షించడం, సంరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ జైన సమాజానికి హామీ ఇచ్చారు.