మన పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నాయో తెలిసిందే. పాలపొడి కావాలన్నా సుమారు రూ.2 వేలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు మన దేశంలో కూడా ఒక ప్రాంతంలో కేజీ నిమ్మకాయలు కావాలంటే రూ.400 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అది కూడా వేసవి కాలంలో సామాన్యులు ఎక్కువగా తాగేది నిమ్మనీళ్లే కావడంతో ఈ ధర వారిని బెంబేలెత్తిస్తోంది.
రాజస్థాన్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల 40 డిగ్రీలపైగా ఎండలు కాస్తున్నాయి. ఇలాంటి తరుణంలో చలవ కోసం నిమ్మనీళ్లు తాగుదామంటే ఎవరి తరమూ కావడం లేదు. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు నిమ్మనీళ్లు ధనవంతుల డ్రింక్ అయిపోయింది. జైపూర్ పరిసర ప్రాంతాల్లో కేజీ నిమ్మకాయల ధర రూ.400 వరకు పలుకుతోంది. గడిచిన 24 గంటల్లోనే నిమ్మకాయల ధర రూ.60 పెరిగిందంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
స్థానికంగా నిమ్మకాయల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుందని, ఇలాంటి సమయంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో నిమ్మకాయల ధర ఆకాశన్నంటుతోందని స్థానిక వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎవరైనా సామాన్యులు నిమ్మకాయలు కొనాలంటే.. రూ.30 చెల్లిస్తే ఒక్కటంటే ఒక్క నిమ్మకాయ దొరుకుతోంది. ఎండాకాలం నిమ్మనీళ్లు తాగడం అలవాటైన వీళ్లంతా ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. ఇలా నిమ్మకాయలు ఒక్కటే కాదు.. చాలా వరకు కూరగాయలన్నీ కేజీ రూ.120పైగానే ధర పలుకుతున్నాయని స్థానికులు చెప్తున్నారు.