న్యూఢిల్లీ: భారత్ నుంచి అత్యధిక గ్రాంట్లు, రుణాలు పొందిన అగ్ర దేశంగా ఈసారి భూటాన్ నిలిచింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో గురువారం మధ్యంతర బడ్జెట్ ( Union Budget 2024) ప్రవేశపెట్టారు. పలు దేశాలకు భారత్ ఇచ్చే గ్రాంట్లు, రుణాల వివరాలు బడ్జెట్లో పేర్కొన్నారు. 2023-24 బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం భారత ప్రభుత్వం పలు దేశాలకు రూ.6,541.79 కోట్లు అందజేసింది. గ్రాంట్‌గా రూ.4,927.43 కోట్లు, రుణంగా రూ.1,614.36 కోట్లు ఇచ్చింది. 2023-24 బడ్జెట్లో పేర్కొన్న రూ.5,848.58 కోట్ల అంచనాలను ఇది అధిగమించింది.
కాగా, 2024-25 బడ్జెట్లో అంచనా వేసిన విదేశీ గ్రాంట్లు, రుణాలు రూ.5,667.56 కోట్లు. భూటాన్‌కు అత్యధికంగా రూ.2398.97 కోట్లు (రూ.1614.36 కోట్ల రుణంతో సహా) కేటాయించారు.
భారత్ నుంచి విదేశీ గ్రాంట్లు, రుణాలు పొందిన టాప్ పది దేశాలు ఇవే:
1. భూటాన్ – రూ.2398.97 కోట్లు
2. మాల్దీవులు – రూ.770.90 కోట్లు
3. నేపాల్ – రూ.650 కోట్లు
4. మయన్మార్ – రూ. 370 కోట్లు
5. మారిషస్ – రూ.330 కోట్లు
6. ఆఫ్ఘనిస్థాన్ – రూ.220 కోట్లు
7. బంగ్లాదేశ్ – రూ.130 కోట్లు
8. శ్రీలంక – రూ.60 కోట్లు
9. సీషెల్స్ – రూ. 9.91 కోట్లు
10. మంగోలియా- రూ. 5 కోట్లు
మరోవైపు ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికైన కొత్త ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. దీంతో పలు దేశాలకు బడ్జెట్లో కేటాయించిన గ్రాంట్లు, రుణాల అంచనాలు మారే అవకాశమున్నది. రుణాలు పొందిన దేశాలు వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.