S Jaishankar : ఒమన్ (Oman) తీరంలో ఇటీవల భారతీయులు ఉన్న నౌకలపై అమెరికా దాడులు చేయడాన్ని భారత్ (India) మరోసారి తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జై శంకర్ (S Jaishankar) మాట్లాడారు. ఈ సందర్భంగా దాడిపై ఆయన తీవ్ర నిరసన తెలియజేశారు. రూబియోతో శుక్రవారం సాయంత్రం మాట్లాడినట్లు జై శంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
గల్ఫ్‌లో అమెరికా జరిపిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించడంపై భారత్ తరఫున నిరసన తెలిపారు. వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఢిల్లీలో అమెరికా దౌత్యాధికారి జేసన్ మీక్స్‌కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ రెండుసార్లు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. భారతీయులున్న నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను టెహ్రాన్ ఖండించింది. ఈ మేరకు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు పెట్టింది. భారతీయులున్న నౌకపై దాడులకు సంబంధించి ట్రంప్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, వారం రోజుల వ్యవధిలోనే మూడు నౌకలపై అమెరికా దాడి చేసి ముగ్గురు అమాయక భారత నావికుల మృతికి కారణమైందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు అది మాపై నిందలు మోపుతోందని ఇరాన్ రాయబార కార్యాలయం రాసుకొచ్చింది.