చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) బీజేపీపై మండిపడ్డారు. ఢిల్లీలోని ఏ శక్తి కూడా దక్షిణాది రాష్ట్రాన్ని ఎప్పటికీ పాలించలేదని అన్నారు. అమిత్ షా కాదు, ఏ షా కూడా తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయలేడంటూ బీజేపీని సవాల్ చేశారు. తిరువళ్లూరు జిల్లాలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడారు. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు నేపథ్యంలో 2026 ఎన్నికల్లో తమిళనాడులో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ‘నేను ఆయన (అమిత్ షా)కు సవాలు విసురుతున్నా. ఢిల్లీ ముందు తమిళనాడు ఎన్నటికీ లొంగదు. ఒక్క అమిత్ షా మాత్రమే కాదు, ఏ షా కూడా తమిళనాడును పాలించలేరు’ అని అన్నారు.
కాగా, బీజేపీ ఎన్నికల వ్యూహాలను సీఎం స్టాలిన్ తోసిపుచ్చారు. ఈడీ దాడులతో నేతలను భయపెట్టడం, పార్టీని విచ్ఛిన్నం చేసే ఫార్ములాలు తమిళనాడులో పని చేయవని అన్నారు. ‘మీరు కలిగించే అన్ని అడ్డంకులను చట్టబద్ధంగా మేం విచ్ఛిన్నం చేస్తాం. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. 2026లో మళ్లీ ద్రవిడ నమూనా ప్రభుత్వమే ఏర్పడుతుంది’ అని అన్నారు.
మరోవైపు తమిళనాడు ఎప్పుడూ ఢిల్లీ నియంత్రణలో లేదని, అలా ఉండబోదని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ‘ఢిల్లీ ముందు తలవంచడానికి మేం బానిసలం కాదు. ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ జీవించి ఉన్నంత వరకు మీ ప్రణాళికలు పనిచేయవు’ అని అన్నారు. తాము అడిగేవి కేకలు కాదని తమిళనాడు హక్కులని చెప్పారు. ‘నేను సీటు కోసం ఎవరి ముందు ఏడవను లేదా మోకాళ్లపై పడను’ అని ప్రధాని మోదీకి కౌంటర్ ఇచ్చారు.
కాగా, ఆత్మగౌరవం, ధైర్యం, గర్వంతో తమ భూమి నిండి ఉన్నదని స్టాలిన్ అన్నారు. ‘ఇక్కడ ఒక్కడిని బెదిరించి, పొత్తులు పెట్టుకుని మీరు గెలువగలరా? మీకు కావాల్సిన వారందరినీ తెచ్చుకోండి.. చూద్దాం’ అంటూ బీజేపీకి సవాల్ విసిరారు.