Lalit Modi : తాను దేశం విడిచి పారిపోయిన వ్యక్తిననే ప్రచారాన్ని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ (IPL Ex Chairman) లలిత్ మోదీ (Lalit Modi) తీవ్రంగా ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. తాను తప్పుచేసి పారిపోయి ఉంటే ప్రభుత్వం తనను ఎప్పుడో పట్టుకునేదని అన్నారు. భారత్ లాంటి శక్తిమంతమైన దేశం కళ్లుగప్పి ప్రపంచమంతా తిరగడం అసాధ్యమని పేర్కొన్నారు. తాను పారిపోతున్నట్లు మీడియా (Media) నే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
దేశంలో మీపై ఉన్న కేసులను పూర్తిగా క్లియర్ చేసుకునేందుకు భారత్‌కు తిరిగి వస్తారా..? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు లలిత్ మోదీ ఆసక్తికర సమాధానం చెప్పారు. తప్పు చేయలేదని రుజువు చేసుకోవాలనే బలమైన కోరిక ఇప్పుడు తనలో లేదని స్పష్టంచేశారు. తనపై వస్తున్న ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ ఆరోపణలను తోసిపుచ్చారు. కేవలం రాజకీయ కారణాలతోనే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటులో, ఎన్నికల ర్యాలీలలో తన పేరును ప్రస్తావించడంపై లలిత్ మోదీ మండిపడ్డారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ రాహుల్ గాంధీ తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. క్రికెట్‌తో ప్రజలకు ఉన్న సెంటిమెంట్‌ను వాడుకోవడానికే తన పేరును ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు.