Heavy Rains | ఉత్తరాది రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. జడివాడతో జనం బెంబేలెత్తుతున్నారు. చాలా ప్రాంతాల్లో వరద నీరు రోడ్లుపైకి, ఇళ్లలోకి రావడంతో జనం కంటిమీద కునులేకుండా చేస్తున్నది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. బీయాస్, యమన తదితర నదులు ఉగ్రరూపం దాల్చాయి. అయితే, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇందుకు కారణాలంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పలు రాష్ట్రాన్ని ఏళ్ల నాటి వర్షాపాతం రికార్డులు బద్దలయ్యాయి.
అయితే, జూన్ నెలాఖరు వరకు పదిశాతం వరకు ఉత్తరభాతరంలో వర్షాపాతం లోటు ఉండగా.. జులై 9 నాటికి 2శాతం అధిక వర్షాపాతం నమోదైంది. దాన్ని బట్టి ఎంత వర్షాపాతం నమోదైందో తెలుస్తుంది. ఈ వర్షాలకు ప్రధాన కారణాలను భారత వాతావరణ శాఖ వివరించింది. మధ్యధరా రీజియన్‌లో ఏర్పడే తుఫానులు (వెస్టర్న్ డిస్టర్బెన్స్), నైరుతి రుతుపవనాలు పరస్పరం కలవడమే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం కురుస్తున్న కుండపోత వర్షాలకు కారణమని పేర్కొంది. రుతుపవనాలు లేని కాలంలో అంటే శీతాకాలంలో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ల ప్రభావం కనిపిస్తుందని, ప్రస్తుతం రుతుపవనాల సమయంలోనే వాటి ప్రభావం ఉండంతో ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొండ ప్రాంతాల నుంచి నదులు ఉప్పొంగుతున్నాయి. గంగానది, అలకనంద, కాళీ, బీన్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదే సమయంలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరకాశీలో ఐదుగురు, రుద్రప్రయాగ్‌లో ఒకరు, వికాస్‌నగర్‌లో ఇద్దరు కొండచరియలు విరిగిపడడంతో మృత్యువాతపడ్డారు. మరోవైపు వర్షాల కారణంగా మైదాన ప్రాంతాలు నీట మునిగాయి.
మరో వైపు ఇవాళ కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ రెడ్ అలెర్ట్‌ను ప్రకటించింది. మరో వైపు వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి గంగోత్రి-యమునోత్రి, బద్రీనాథ్-కేదార్నాథ్ హైవేతో సహా మొత్తం 302 రోడ్లు మూసివేశారు. గంగోత్రి హైవేను అర్ధరాత్రి మూసివేయడంతో ప్రయాణికుల వాహనాలు గంగ్నాని సమీపంలో నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడి కొండపై టెంపో ట్రావెల్స్ సహా మూడు వాహనాలపై పడ్డాయి. మూడు వాహనాలపై పడడంతో ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ మహిళ సహా నలుగురు మృతి చెందారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బోట్ క్లబ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మఠం మార్కెట్ సివిల్ లైన్ వరకు వరద నీరు చేరింది.
యమునాలో భారీ వరద ప్రవాహం నేపథ్యంలో ఖాదర్ ప్రాంతాన్ని అధికారులు ఖాళీ చేయించారు. వికాస్ మార్గ్ వైపు టెంట్లు వేసి ప్రజలు రోడ్డు పక్కనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
యమునా నదిలో వరదను పరిశీలించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక సిబ్బంది నియమించింది. నీటిమట్టం మరింత పెరిగితే సివిల్ డిఫెన్స్ సిబ్బంది వరద కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వనున్నారు. వర్షాలతో ఢిల్లీలోని ఇండియా గేట్ ప్రాంతంలో రహదారిలో ఎక్కువ భాగం కుంగిపోయింది. దాంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటిమట్టం 206.32 మీటర్లుగా నమోదై ప్రమాద స్థాయికి మించి నమోదైంది. అత్యధిక వరద స్థాయి 207.49 మీటర్లు కాగా.. ముందుజాగ్రత్త చర్యగా పాత రైల్వే వంతెనపై రైలు రాకపోకలను నిలిపివేశారు.
భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తుతున్నది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా అరడజనుకుపైగా వంతెనలు నదుల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరదలతో చాలాచోట్ల రోడ్లను మూసివేయగా.. పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో కనీసం 18 మంది మృత్యువాతపడ్డారు. సిమ్లా-కల్కా, మనాలి-చండీగఢ్ జాతీయ రహదారులతో సహా 1,239 రోడ్లు బ్లాక్ చేశారు. 1,416 రూట్లలో రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేశారు. ట్రాన్స్ఫార్మర్లకు అంతరాయం ఏర్పడడంతో కులు, మండిలోని అనేక ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. రాష్ట్ర రాజధాని సిమ్లాతో సహా 1,418 నీటి సరఫరా పథకాలు దెబ్బతినడంతో నీటి సరఫరా సైతం ప్రభావితమైంది. కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో రోడ్లను అధికారులు మూసివేశారు. మనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలు దాదాపు 24 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. మొబైల్ కనెక్టివిటీకి సైతం అంతరాయం ఏర్పడింది.