న్యూఢిల్లీ: ఇంట్లో వాడే నాన్‌స్టిక్ వంటపాత్రల్లో పీఎఫ్ఏఎస్ అనే విషపూరిత రసాయనాలు ఉంటాయని తేలింది. కాబట్టి వీటి వాడకం ఏమంత సురక్షితం కాదని ఇటీవలి అధ్యయనాలు పేర్కొన్నాయి. పీఎఫ్ఏఎస్ అనే ది ఆరోగ్యంతోపాటు పర్యావరణానికి కూడా హాని చేస్తుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం కోసం అన్వేషించిన టొరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త నాన్‌స్టిక్ కోటింగ్‌ను అభివృద్ధి చేశారు.
టెఫ్లాన్కు ప్రత్యామ్నాయంగా సిలికాన్‌గా పిలిచే పాలీడిమెథిల్సిలోక్సేన్ (పీడీఎంఎస్)ను కొత్త మెటీరియల్‌ను పూతగా వినియోగించి విజయం సాధించారు. మానవ శరీరంలో కొన్ని భాగాల ఇంప్లిమెంటేషన్ కోసం సిలికాన్‌ను ఉపయోగిస్తారు. కాబట్టి దీనివల్ల మానవులకు ఎలాంటి ముప్పు ఉండదు. ఇప్పుడు దీంతో కొత్త నాన్‌స్టిక్ కోటింగ్‌ను అభివృద్ధి చేశారు.
ఈ వినూత్న సాంకేతికత వంటసామాన్లు, ఇతర ఉత్పత్తులలో మనం ఆశించే అద్భుతమైన నాన్‌స్టిక్ పనితీరును ప్రమాదకరమైన రసాయనాలు లేకుండానే అందిస్తుంది. తద్వారా ఆరోగ్యం అందించడంతోపాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది వంట సామాన్ల తయారీ పరిశ్రమలో ఒక కొత్త మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంది.