న్యూఢిల్లీ : రుచికరమైన ఆహారాన్ని తినకపోయినా, కేవలం వాసన చూస్తే చాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. డయాబెటాలజీ నిపుణుడు డాక్టర్ రాజీవ్ కోవిల్ తెలిపిన వివరాల ప్రకారం, ఆహారం వాసనకు, తినబోతున్నాననే ఆలోచనకు మెదడు, శరీరం ప్రతిస్పందించడమే దీనికి కారణం. మెదడు మీ శరీరాన్ని సిద్ధం చేయడానికి సంకేతాలను పంపిస్తుంది. దీనిలో భాగంగా అడ్రెనలైన్, కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. తినబోయే ఆహారం కోసం మీకు శక్తినివ్వడానికి రక్త ప్రవాహంలోకి అదనపు గ్లూకోజ్ (షుగర్)ను విడుదల చేయాలని మీ కాలేయానికి ఈ హార్మోన్లు చెబుతాయి. మధుమేహం లేని వారికి ఇది సాధారణ స్పందన అయినప్పటికీ, మధుమేహంతో బాధపడేవారి శరీరం ఈ షుగర్‌ను సరైన విధంగా నిర్వహించలేదు. ఇన్సులిన్ చాలా ఆలస్యంగా విడుదలవుతుంది లేదా, సమర్థంగా ఉండదు. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్ అధికంగానే ఉండిపోతుంది.
ఆహారాన్ని తినడం ప్రారంభించడానికి ముందే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం ప్రారంభమవుతుందని డాక్టర్ విజయ్ నెగలూర్ చెప్పారు. రుచికరమైన దానిని వాసన పీల్చినపుడు, మెదడు పాంక్రియాస్నకు సంకేతాలను పంపిస్తుందని, ఇన్సులిన్‌ను తయారు చేయడం ప్రారంభించాలని చెప్తుందని చెప్పారు.
ఆహారపు వాసన మెదడుకు చేరుకోగానే, అది ఇన్సులిన్, గ్యాస్ట్రిక్ యాసిడ్, జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైముల విడుదలను ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియ, గ్లూకోజ్ మెటాబాలిజంలకు శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఈ విధంగా విడుదలయ్యే ఇన్సులిన్ కేవలం తాత్కాలికంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గేలా చేస్తుంది. కానీ ఆహారాన్ని తినడం కోసం శరీరం సహజంగా సిద్ధమవడంలో ఇది భాగమే అయినా, మధుమేహాన్ని మేనేజ్ చేసుకునే వారిపై లేదా, బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గుల ప్రభావానికి సునాయాసంగా గురయ్యే వారిపై ఇది గమనించదగ్గ ప్రభావం చూపుతుంది. ఇతర ఆహారం కన్నా స్వీట్ లేదా కార్బొహైడ్రేట్-రిచ్ ఫుడ్ వల్ల జీర్ణ వ్యవస్థ, శరీరంలో ముందస్తు మార్పులు ఎక్కువగా కలుగుతాయి.