(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌లో (ఎంవోఎఫ్) కొత్తరకం మాలిక్యులార్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఘీలకు స్టాక్‌హోంలోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పురస్కారాలను ప్రకటించింది. జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీలో కిటాగవా ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్లో రాబ్సన్ సేవలు అందిస్తున్నారు. ఇక, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో యాఘీ విధులు నిర్వహిస్తున్నారు.
ఏమిటీ పరిశోధన?
లోహ, సేంద్రీయ అణువులతో నిర్మించిన సూక్ష్మ రంధ్రాలు కలిగిన అతి పెద్ద పదార్థాలను మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (ఎంవోఎఫ్)గా పిలుస్తారు. తేనెపట్టులో ఉండే రంధ్రాల మాదిరిగా వీటి అమరిక ఉంటుంది. ప్రస్తుతం పర్యావరణం ఎదుర్కొంటున్న పెను సవాళ్లకు పరిష్కారాన్ని చూపించే మార్గాలు ఎంవోఎఫ్లలో ఉండొచ్చని శాస్త్రవేత్తల భావన. ఈ క్రమంలో ఎంవోఎఫ్లో కొత్తరకం మాలిక్యులార్ ఆర్కిటెక్చర్‌ను ఈ శాస్త్రవేత్తల త్రయం రూపొందించింది. దీని ద్వారా కార్బన్‌డైఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఎంవోఎఫ్ గుండా సులభంగా ప్రయాణించగలవు. అంతేకాదు పర్యావరణానికి హానికరమైన గ్రీన్‌హౌజ్ వాయువులను పీల్చుకోవడంతో పాటు నీటిని శుద్ధి చేసే విధానం ఎంవోఎఫ్లోని ఈ కొత్తరకం మాలిక్యులార్ ఆర్కిటెక్చర్లో ఉన్నది. పర్యావరణానికి హాని చేసే విష వాయువుల నియంత్రణకు తాజా పరిశోధన సాయపడొచ్చు.