న్యూఢిల్లీ, జూలై 1: దేశంలో ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల్లో సహనం కంటే వాళ్ల మధ్య ఐక్యత అత్యవసరం’ అని అభిప్రాయపడ్డారు. కోల్కతాలో అమర్త్యసేన్ రిసెర్చ్ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మీరు దేనికైనా భయపడుతున్నారా అని నన్ను ఎవరైనా అడిగితే అవుననే అంటాను. నా భయానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని నేను కోరుకొంటాను. సహనం అనేది మన సంస్కృతిలో, మన విద్యా వ్యవస్థలోనే భాగమై ఉంది. కానీ ప్రస్తుతం సహనానికంటే ఎక్కువగా దేశానికి ఐక్యత అవసరం. ప్రజలు కలిసి ఉండాలి. దీన్ని దేశం అర్థం చేసుకోవాలి’ అని అమర్త్యసేన్ అన్నారు.