స్టాక్‌హోమ్, అక్టోబర్ 8: భౌతిక శాస్త్రంలో విశేష సేవలు అందించిన శాస్త్రవేత్తలు జాన్ హోప్‌ఫీల్డ్, ‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ’ జెఫ్రీ హింటన్‌కు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం లభించింది. స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం 2024కు గానూ భౌతిక శాస్త్రంలో వీరిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసింది. ‘వీరిద్దరూ భౌతికశాస్త్రంలోని సాధనాలను ఉపయోగించి నిర్మించిన పద్ధతులు నేడు శక్తిమంతంగా మారిన మెషీన్ లెర్నింగ్‌కు పునాదులు వేయడానికి ఉపయోగపడ్డాయి. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఆధారిత మెషీన్ లెర్నింగ్ ప్రస్తుతం ఇంజినీరింగ్‌లో, నిత్య జీవితంలో విప్లవాత్మక శాస్త్రంగా మారింది’ అని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. కాగా, ప్రస్తుతం జాన్ హోప్‌ఫీల్డ్ అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో, జియోఫ్రే హింటన్ కెనడాలోని టొరంటో యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. వీరికి నోబెల్ పురస్కారం కింద రూ.8.4 కోట్ల నగదు బహుమతి అందనుంది.
ఏఐ దుష్పరిణామాలపై హింటన్ ఆందోళన
నోబెల్ పురస్కారానికి ఎంపికైన తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో హింటన్ మాట్లాడుతూ ఏఐ ద్వారా సంభవించనున్న దుష్పరిణామాలపై ఆందోళన పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘పారిశ్రామిక విప్లవం లాంటి భారీ ప్రభావం ఏఐ ద్వారా కూడా ఉంటుంది.ఇది మెరుగైన వైద్యసేవలు అందించగలదు. ఉత్పాదకతను ఇది భారీగా పెంచుతుంది. అయితే, దీని చెడు పరిణామాల పట్ల కూడా మనం ఆందోళన చెందాలి. ఏఐ లాంటివి మన నియంత్రణను దాటిపోతే కలిగే ముప్పు గురించి ఆందోళన అవసరం’ అని హింటన్ అన్నారు. ఏఐ రంగంలో నైతికతను పాటించడం, బాధ్యతాయుతమైన అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.