న్యూఢిల్లీ: వక్ఫ్ బై యూజర్తోసహా వక్ఫ్ ఆస్తులు వేటినీ డీనోటిఫై చేయడం కాని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, బోర్డులలో నియామకాలు కాని మే 5వ తేదీ వరకు చేపట్టబోమని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం వక్ఫ్ (సవరణ) చట్టం 2025ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది.
వక్ఫ్ బై యూజర్తోసహా వక్ఫ్ ఆస్తుల డీ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వును జారీచేస్తామన్న సుప్రీంకోర్టు ప్రతిపాదనను కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గట్టిగా వ్యతిరేకించారు. అంతేగాక సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరుల నియామకాన్ని అనుమతించే నిబంధనపై స్టే ఇస్తామన్న ప్రతిపాదనను కూడా మెహతా వ్యతిరేకించారు.
వారం రోజుల్లో ప్రాథమిక సమాధానాన్ని కేంద్రం సమర్పించనున్నట్లు ఆయన ధర్మాసనానికి తెలిపారు. తదుపరి విచారణ తేదీ వరకు వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులలో వక్ఫ్ (సవరణ) చట్టంలోని 9, 14 సెక్షన్ల కింద నియామకాలు చేపట్టబోమని కూడా కోర్టుకు హామీ ఇచ్చారు. అలాగే, ఇప్పటికే రిజిస్టర్ అయిన లేదా నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన వక్ఫ్ బై యూజర్తోసహా వక్ఫ్ ఆస్తులు వేటినీ డీనోటిఫై చేయడం కాని అంతరాయం కలిగించడం కాని చేయబోమని కేంద్రం తరఫున మెహతా ఇచ్చిన హామీని ధర్మాసనం నమోదు చేసింది. తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.
చట్ట నిబంధనలపై స్టే ఇవ్వడం కఠిన చర్యగా మెహతా అభివర్ణించారు. కొంత సమాచారం, దస్ర్తాలు, చట్టాలను వివరిస్తూ ప్రాథమిక జవాబును వారం రోజుల్లో ఇస్తామని మెహతా తెలియచేస్తూ ఒక వారంలో ఏమీ మారబోదని వ్యాఖ్యానించారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది వాదనలు వినిపిస్తూ ‘వారం రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేయకపోతే మిన్ను విరిగి మీద పడదు’ అని వ్యాఖ్యానించారు.