Mid Day Meal | రాయ్పూర్, జూలై 6: భోజనం అంటే అంటే పప్పు, కూర, పచ్చడి, చారు, పెరుగు లాంటి కనీస ఆహార పదార్థాలు గుర్తుకు వస్తాయి. అయితే వీటి మాట దేవుడెరుగు. కనీసం చారు అన్నం కూడా లభించని దౌర్భాగ్య స్థితిలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు.
ఈ బీజేపీ పాలిత రాష్ట్రంలో కేవలం పసుపు కలిపిన అన్నాన్ని మాత్రమే పరమాన్నం స్థాయిలో మధ్యాహ్న భోజన పథకంలో వడ్డిస్తున్నారంటే విద్యార్థుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క రాష్ట్రంలోని 52 వేల అంగన్వాడీ సెంటర్లకు రెడీ టూ ఈట్ ఆహార సరఫరాను నిలిపివేయగా, మరో పక్క అంగన్వాడీలకు నిరవధికంగా పోషకాహారాన్ని సరఫరా చేస్తున్నామని ఆ రాష్ట్ర మంత్రి లక్ష్మీ రాజ్వాడే నిస్సిగ్గుగా ప్రకటనలు చేస్తున్నారు.
రాష్ట్రంలోని బలరాంపూర్ లోని బీజకూర గ్రామంలోని పాఠశాలలో మధ్యాహ్న భోజ నం కింద 43 మంది విద్యార్థులకు కేవ లం పసుపు కలిపిన అన్నాన్ని వడ్డిస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ విషయాన్ని ఆ స్కూల్ ఇన్చార్జి టీచర్ కూడా అంగీకరించారు. మధ్యాహ్న భోజనానికి సరుకులు పంపే సరఫరాదారు వారం రోజులుగా కూరగాయలు, పప్పు దినుసులను ఇవ్వడం లేద ని, అదేమంటే తమ పెండింగ్ బిల్లులు చెల్లించనందున వాటిని సరఫరా చేయలేమన్నారని తెలిపారు.
రాష్ట్రంలోని పలు పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది. కాగా, పిల్లల్లో, గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని అధిగమించడానికి రెడీ టూ ఈట్ పేరిట పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. అయితే గత వారం రోజులుగా సంబంధిత సరఫరా దారు వాటిని తమకు ఇవ్వడం లేదని అంగన్వాడీ సెంటర్ల నిర్వాహకులు తెలిపారు. ఛత్తీస్గఢ్లో పోషకాహార లోపం శాతం 2022 లో 17.6 శాతంగా నమోదైంది.