న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా వాహనదారులకు కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. వ్యక్తిగత వాహనదారులకు మాత్రమే ఈ వార్షిక పాస్ లభిస్తుంది. వాణిజ్య వాహనాలకు లభ్యం కాదు. రూ.3 వేలతో కొనుగోలు చేసే ఈ పాస్ టోల్‌ప్లాజాకు సగటున రూ.15తో ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఏఏ రోడ్లకు వర్తిస్తుందన్న దానిపై గందరగోళం ఏర్పడటంతో అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. ఈ ఫాస్టాగ్ కేవలం జాతీయ రహదారులకు మాత్రమే వర్తిస్తుంది.
దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏఐ నిర్వహించే 1159 టోల్‌ప్లాజాల వద్ద పాస్ చెల్లుతుంది. అదే సమయంలో రాష్ర్టాలు, స్థానిక సంస్థలు నిర్వహించే ఎక్స్‌ప్రెస్ వేలు, రహదారులపై ఉండే టోల్ ప్లాజాల వద్ద ఇది చెల్లదు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాబట్టి, అక్కడ ఈ పాస్ చెల్లదు. ప్రయాణించే మార్గంలో టోల్‌ప్లాజాలు ఎవరి పరిధిలోకి వస్తాయో తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.