చెన్నై: చౌరస్తాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తుల విగ్రహాలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విగ్రహాలన్నింటినీ మూడు నెలల్లోగా తొలగించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తొలగించిన విగ్రహాలను ‘లీడర్స్ పార్క్’కు తరలించాలని సూచించింది. లీడర్స్ పార్క్ ఏర్పాటు కోసం అధికారులు మూడు నెలల్లోగా స్థలం వెతకాలని జస్టిస్ ఎన్ఎం సుబ్రమణియన్ తీర్పునిచ్చారు. ఈ మూడు నెలల్లో రాష్ట్రంలో ఎక్కడా కొత్త విగ్రహం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తమిళనాడులో రోడ్డుపై ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాలని అధికారులు ఆదేశించడంతో ఓ న్యాయవాది హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు గురువారం విచారణ జరిపిన ధర్మాసనం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటు సబబు కాదని తీర్పునిచ్చింది. తమిళనాడులో హైవేలు, రోడ్లు, ప్రభుత్వ భూములు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న విగ్రహాలను మూడు నెలల్లో గుర్తించాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని జస్టిస్ సుబ్రమణియన్ ఆదేశించారు. లీడర్స్ పార్క్లో ఏర్పాటు చేసే విగ్రహాల నిర్వహణను.. వాటి ఏర్పాటుకు అనుమతి తీసుకొన్నవారే చూసుకోవాలని పేర్కొన్నారు. ఈ తీర్పును ఆరు నెలల్లోగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.