Manish Sisodia | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఢిల్లీలో ఘటన జరిగినందున తాము జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఢిల్లీలో ఉన్నంత మాత్రాన నేరుగా సుప్రీంకోర్టుకు రావడమేంటని ప్రశ్నించింది. ‘ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేం’ అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొనగా.. ‘ఢిల్లీలో ఘటన జరిగినంత మాత్రాన ఈ కేసు సుప్రీంకోర్టుకు వస్తుందని అర్థం కాదు’ అని జస్టిస్ నరసింహ అన్నారు. సిసోడియాకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఉన్నాయని, ఈ క్రమంలో పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
‘ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్ విచారణకు స్వీకరించడానికి ఇష్టపడడం లేదు’ అని ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. సిసోడియా విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఆయన అరెస్ట్‌పై స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ-2021 కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఆదివారం సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనను సీబీఐ హాజరుపరిచి.. కస్టడీకి కోరింది. ఈ మేరకు మార్చి 5వ తేదీ వరకు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన విచారణ అనంతరం సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం లైసెన్స్‌ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లుగా సిసోడియాపై ఆరోపణలున్నాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా సిఫారసు మేరకు సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. అయితే, ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్లో ఆయన పేరు లేదు కానీ, ఆయనతో పాటు మరికొందరి పాత్రపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. అయితే, మనీష్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది.