న్యూఢిల్లీ, మార్చి 24: నిర్వహణా కార్యకలాపాలు, టికెటింగ్ పారదర్శకత, సరుకు రవాణాను మెరుగుపరిచే లక్ష్యంతో భారతీయ రైల్వే పలు సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నదని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం తెలిపారు. రైలు టికెట్ల రద్దు, వాపసులకు సంబంధించి కీలక సంస్కరణలను ఆయన ప్రకటించారు. గతంలో చార్ట్ తయారీకి ముందు కాకుండా ఇప్పుడు ప్రయాణికులు రైలు బయల్దేరడానికి 30 నిమిషాల ముందు వరకు తమ బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకోవచ్చని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. 72 గంటల కంటే ముందుగా టికెట్‌ను రద్దు చేసుకుంటే మ్యాగ్జిమమ్ రిఫండ్ చేస్తారు. కొంత క్యాన్సిలేషన్ చార్జీ వసూలు చేస్తారు. అయితే 72 నుంచి 24 గంటల మధ్యలో రద్దు చేసుకుంటే చార్జీలో 25 శాతం జరిమానా పడుతుందని కేంద్ర మంత్రి వైష్ణవ్ చెప్పారు.
24 గంటల నుంచి 8 గంటల మధ్యలో రద్దు చేసుకుంటే 50 శాతం టికెట్ చార్జీ వాపసు లభిస్తుందని, అయితే 8 గంటల కంటే తక్కువ సమయంలో రద్దు చేసుకుంటే ఎటువంటి వాపసు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో కౌంటర్ టికెట్‌ను రద్దు చేసుకోవాలంటే రైలు ప్రారంభమయ్యే స్టేషన్లో మాత్రమే అవకాశం ఉండేది. ఇకపై ఏ స్టేషన్లోనైనా రద్దు చేసుకోవచ్చు. కౌంటర్ టికెట్‌పై ప్రయాణానికి 30 నిమిషాల ముందు కూడా ఇకపై ప్రయాణ తరగతిని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. భారతీయ రైల్వే ప్రాంగణాల్లో అనధికారిక విక్రయదారులను నివారించడానికి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) క్యూఆర్ ఆధారిత గుర్తింపు కార్డులు, డిటిజల్గా గుర్తించగల ఆహార ప్యాకెట్లను ప్రవేశపెట్టిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ చర్య ద్వారా ప్రయాణికుల భద్రతను పటిష్టం చేయాలని ఐఆర్సీటీసీ లక్ష్యంగా పెట్టుకుంది.