హైదరాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ) : మొఘల్ పాలనను, భూస్వామ్య అణచివేతను ఎదిరించి పేదల హకుల కోసం పోరాడిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మనందరికీ ప్రేరణ అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. పాపన్న జన్మించిన ఖిలాషాపూర్ నుంచే తాను కూడా రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తన చొరవతో లండన్ మ్యూజియం నుంచి పాపన్న చిత్రపటాన్ని సేకరించి ఖిలాషాపురంలో మొట్టమొదటి విగ్రహం ప్రతిష్ఠించినట్టు గుర్తుచేశారు. మంగళవారం పాపన్న జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్ వంటి నేతల నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం ఎలాగైతే ఊపందుకున్నదో, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఎలాగైతే సాకారమైందో.. సామాజిక మార్పునకు కూడా సమయం పడు తుందని, పాపన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకొని బహుజనుల ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పొన్నాల పిలుపునిచ్చారు.
రాచరిక పాలనతో మహామహులే మట్టిలో కలిసిపోయారని.. సర్దార్ పాపన్న స్ఫూర్తితో అందరినీ కలుపుకొని పాలన సాగించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సీఎం రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. పాపన్న వరంగల్ జిల్లావారు కావడం ఎంతో గర్వకారణమని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు కిశోర్‌గౌడ్, పల్లె రవికుమార్‌గౌడ్, ఆంజనేయులుగౌడ్, గెల్లు శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వాల్యానాయక్, రామచంద్రునాయక్, వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు తుల ఉమ, సుమిత్రానంద్, తుంగ బాలు, పడాల సతీశ్, రంగినేని అభిలాష్, యాదయ్యగౌడ్, బత్తిని లత, మమత, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి పాపన్న ప్రతీకగా నిలిచారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు కొనియాడారు. స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్ది, సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా పాపన్న ఆశయాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిందని పేరొన్నారు. ‘ఎక్స్’ వేదికగా సర్వాయి పాపన్నకు హరీశ్‌రావు నివాళులర్పించారు. పాపన్న స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించేలా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఏటా అధికారికంగా నిర్వహించాలని అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారని గుర్తుచేశారు.
ప్రజల భూములు, ఆస్తులు దోచుకుంటూ, సంక్షేమ పథకాలను నిలిపివేసి పేదల కడుపు కొట్టాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పాపన్నను ఆదర్శంగా తీసుకొని పోరాటం చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ‘ఎక్స్’ వేదికగా పాపన్నకు నివాళులర్పించారు.