న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటు వేయడాన్ని తప్పనిసరి చేసే ప్రతిపాదన లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం తెలిపారు. ప్రజలకు ఉచిత తాయిలాల పంపిణీపై రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీలను కట్టడి చేసే ఆలోచన లేదని చెప్పారు.
లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు ఆయన వేర్వేరుగా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాల్లో ఈ వివరాలను వెల్లడించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 65.79 శాతం ఓట్లు నమోదైనట్లు తెలిపారు. అస్సాంలో అత్యధికంగా, బీహార్‌లో అత్యల్పంగా ఓట్లు పోలయ్యాయని చెప్పారు.
సీఏఏకు ఈ పత్రాలు సమర్పించండి
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే వారి నిబంధనల పరిధిని కేంద్రం విస్తరించింది. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు చెందిన పీడిత మైనారిటీ వర్గానికి చెందిన వారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు సమర్పించాల్సిన డాక్యుమెంట్ల గురించి స్పష్టతనిచ్చింది.
దరఖాస్తుదారుల తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు పై మూడు దేశాలకు చెందిన ఒక దానిలో పౌరులుగా ఉన్నారని రుజువు చేస్తూ మన దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లేదా పాక్షిక న్యాయవ్యవస్థ జారీ చేసే ఏదైనా పత్రాన్ని ఆమోదిస్తామని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
సీఏఏ, 2019కు సంబంధించి పలు సందేహాలు రావడంతో కేంద్ర హోం శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. దరఖాస్తుదారుల తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు పై మూడు దేశాలకు చెందిన వారంటూ రుజువుచేస్తే చాలని గతంలో ఉండగా, తాజాగా దీనిపై ఇచ్చిన వివరణ ప్రకారం సదరు పత్రాలు దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పాక్షిక న్యాయవ్యవస్థలు జారీ చేసి ఉండాలని స్పష్టం చేసింది.