న్యూఢిల్లీ : ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లను మైక్రోవేవ్ ఓవెన్లలో వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. మీరేకాక, మీ పిల్లలను కూడా ఇలాంటి ఆహారానికి దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లను మైక్రోవేవ్ ఓవెన్లో వాడటం వల్ల విషపూరితమైన బిలియన్ల ప్లాస్టిక్లు విడుదలవుతాయని ఒక పరిశోధనలో తేలింది. ఈ బేబీ ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లను వాడటం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రతి చదరపు సెంటీమీటర్ కంటైనర్ పరిమాణానికి రెండు మిలియన్ల నానో ప్లాస్టిక్లు, నాలుగు మిలియన్ల సూక్ష్మ ప్లాస్టిక్ విష కణాలు విడుదల అవుతాయని చెప్పారు. శరీరంలోని కణాలలో చేరిన రెండు రోజుల తర్వాత మూడొంతుల కల్చర్డ్ మూత్రపిండ కణాలు చనిపోతాయని ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్లో ప్రచురితమైన ఈ పరిశోధన వ్యాసం హెచ్చరించింది. ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్ల వాడకం కారణంగా మనం ప్రతిరోజూ శరీరానికి తీవ్ర హానిని కలిగించే ఎన్ని మైక్రో, నానోప్లాస్టిక్లను శరీరంలోకి తెచ్చుకుంటున్నామో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధనకు నాయకత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కాలింకన్కు చెందిన ప్రొఫెసర్ ఖాజీ అల్బాబ్ హుస్సేన్ హెచ్చరించారు.