Palm Oil | న్యూఢిల్లీ, జూలై 8: పామాయిల్ ఫ్రీ, నో పామాయిల్.. అనే లేబుల్‌తో మార్కెట్లో ఆహార ఉత్పత్తుల అమ్మకాలు పెరగటంపై ‘ఇండ్ ఫుడ్ అండ్ బేవరేజ్ అసోసియేషన్’ (ఐఎఫ్బీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో 19వ శతాబ్దం నుంచి పామాయిల్ వాడకమున్నదని, ఇది తినదగిన వంట నూనెల్లో ఒకటని ఐఎఫ్బీఏ పేర్కొన్నది. పామాయిల్ ఫ్రీ.. అంటూ జరుగుతున్న ప్రచారం మార్కెటింగ్ గిమ్మిక్ అని, వినియోగదారులను తప్పుదారి పట్టించేది తప్ప మరోటి కాదని తెలిపింది. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని వినియోగదారులకు సూచించింది. ప్రముఖ బ్రాండ్స్ ఇలాంటి మార్కెటింగ్ పద్ధతులను అనుసరించటాన్ని తప్పుబట్టింది. సోషల్ మీడియా ట్రెండ్స్ ఆధారంగా తమ ఆహార ఎంపికలు చేసుకోరాదని వినియోగదారులను కోరింది. ‘ఆరోగ్యం, సమతుల ఆహారంలో పామాయిల్ పాత్రను సైంటిఫిక్‌గా గుర్తించినా, వినియోగదారులను తప్పుదారి పట్టించేందుకు ‘నో పామాయిల్’ అన్న లేబుల్‌ను వాడుతున్నారు. దీనికి శాస్త్రీయత లేదు’ అని ఐఎఫ్బీఏ చైర్పర్సన్ దీపక్ జాలీ చెప్పారు.
ఆయిల్ పామ్ చెట్ల పండులోని గుజ్జు నుండి పామాయిల్ తీస్తారు. దీనిని ప్రపంచంలో ఇండోనేషియా, మలేషియా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తాయి. చౌకగా దొరికే వంట నూనెల్లో పామాయిల్ ఒకటి. మధ్య తరగతి, పేద ప్రజలకు అందుబాటులో ఉండటమేగాక స్థిరమైన పోషకాలు, ఎక్కువకాలం పాటు నిల్వ ఉండటం దీని ప్రత్యేకత. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, మోనోశాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. భారత్ ఏటా 2.6 కోట్ల టన్నుల వంట నూనెల్ని వినియోగిస్తున్నది. ఇందులో 90 లక్షల టన్నులు పామాయిల్ వాడకమున్నది. ఐసీఎంఆర్-2024 గైడ్‌లైన్స్ ప్రకారం, శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించటంలో, గుండె ఆరోగ్యానికి పామాయిల్‌లోని ‘టోకోట్రియనాల్స్’ కీలక పాత్ర పోషిస్తాయి. సన్‌ఫ్లవర్, వేరుశెనెగ, నువ్వుల నూనెలతోపాటు పామాయిల్‌ను తీసుకోవటం ద్వారా శరీరానికి సమతుల ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయని సైన్స్ చెబుతున్నది.