Japan PM Fumio Kishida | ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చాలా తీవ్రమైన విషయం అని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా స్పష్టం చేశారు. అంతర్జాతీయ మూలాలను, పరిస్థితులను దెబ్బ తీసే చర్య అని అభిప్రాయ పడ్డారు. ఉక్రెయిన్ను ఆక్రమించుకునేందుకు అనుమతించబోమని పేర్కొన్నారు. అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ఫుమియో కిషిడా శనివారం ప్రధాని నరేంద్రమోదీతో చర్చల తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రపంచ దేశాల ముఖచిత్రాన్ని, బలవంతంగా మార్చేందుకు అనుమతించబోమన్నారు.
ఉక్రెయిన్‌కు మద్దతునిస్తామని ఫుమియో కిషిడా చెప్పారు. ఉక్రెయిన్-రష్యా మధ్య సంక్షోభానికి భారత్, జపాన్ శాంతియుత పరిష్కారం చూపుతాయన్నారు. కానీ, భారత్ మాత్రం తటస్థ వైఖరిని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సంయుక్త సమావేశానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు.
రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భారత్, జపాన్ భావిస్తున్నాయని ఫుమియో కిషిడా అన్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్ మధ్య స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తామని చెప్పారు. చైనాను ఎదుర్కొనేందుకు భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా కలిసి క్వాడ్ కూటమి ఏర్పాటు చేశాయి.