Tejaswi Yadav | బీహార్ మహాకూటమిలో చేరాలన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆఫర్ను సీఎం నితీశ్ కుమార్ తిరస్కరించిన కొన్ని గంటల్లోనే ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వి ప్రసాద్ యాదవ్ స్పందించారు. మహా కూటమిలో చేరాలన్న ప్రతిపాదనేదీ నితీశ్ కుమార్కు ఇవ్వలేదని ఆదివారం వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్ పూర్తిగా అలసిపోయారని, సొంతంగా ఆయన నిర్ణయం తీసుకోగల పరిస్థితిలో లేరని చెప్పారు.
ఆదివారం తేజస్వి ప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గ్రాండ్ అలయెన్స్ కూటమిలో చేరాలని నితీశ్ కుమార్కు ఆర్జేడీ నుంచి ఎటువంటి ప్రతిపాదనే వెళ్లలేదన్నారు. నితీశ్ కుమార్ పూర్తిగా అలసిపోయారని, రిటైర్డ్ అధికారుల సాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. కేవలం పత్రికా ప్రకటన ద్వారా రాజకీయ ప్రకటన చేయడం అత్యంత దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. బీహార్లో ఇటువంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి అని అన్నారు.
నలుగురైదుగురు జేడీయూ నేతల మధ్య నితీశ్ కుమార్ బందీగా ఉన్నారని, స్వేచ్ఛగా పని చేయనివ్వడం లేదని తేజస్వి ప్రసాద్ యాదవ్ అన్నారు. ఎన్డీఏలోకి నితీశ్ కుమార్ వెళ్లడంపై మీడియా ఎక్కువ ఊహాగానాలు చేయొద్దని సూచించారు.