ముంబై: మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు. కూటమిలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందో దాని ఆధారంగా సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారని తెలిపారు. ఎంవీఏ కూటమి సీఎం అభ్యర్థిగా శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ప్రకటించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అయితే కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) ఈ ప్రతిపాదనను పలుమార్లు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో బుధవారం కొల్హాపూర్లో మీడియాతో శరద్ పవార్ మాట్లాడారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరంలేదన్నారు. ‘సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల ఎలాంటి అడ్డంకి లేదు. దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు నాయకత్వం వహించాలనేది సీట్లను బట్టి నిర్ణయించుకోవాలి. ఎన్నికల ముందు అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.
కాగా, సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు ఎంవీఏ కూటమి నేతలు చర్చలు జరుపాలని శరద్ పవార్ కోరారు.
రైతులు, కార్మికుల పార్టీ, సీపీఐ, సీపీఎం కూడా ఈ చర్చల్లో పాల్గోవాలని పిలుపునిచ్చారు. ఈ పార్టీలకు మహారాష్ట్రలో కొంత ప్రభావం ఉందని అన్నారు.