లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బీజేపీ పార్టీ ఇప్పటి వరకు 194 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో ఒక్క ముస్లింకు సైతం టికెట్ ఇవ్వలేదు. ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్లో సైతం బీజేపీ ముస్లిం అభ్యర్థిని బరిలో నిలుపలేదు. అయితే, ఎన్నికల్లో గెలిచే సామర్థ్యాన్ని బట్టి అభ్యర్థులకు పార్టీ టికెట్లు ఇస్తుందని ఆ పార్టీ నేత జమాల్ సిద్దిఖీ అన్నారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం, పార్టీ అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడుతాయని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఎన్డీయే కూటమిలోని అప్నాదళ్ (ఎస్) పార్టీ నుంచి హైదర్ అలీఖాన్ తొలిసారిగా ముస్లిం అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. 2014 తర్వాత యూపీలో ఎన్డీఏ కూటమి నుంచి బరిలోకి దిగిన తొలి ముస్లిం అభ్యర్థిగా నిలిచారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో బీజేపీ మైనారిటీ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ గెలుపు ఆధారంగా కార్యకర్తలకు టికెట్లు వచ్చేలా చూస్తామని హామీఇచ్చారు. ముస్లిం మెజారిటీ సీట్లన్నింటిలోనూ బీజేపీకి అనుకూలంగా కనీసం ఐదువేల ముస్లిం ఓట్లు వచ్చేలా మైనారిటీ ఫ్రంట్ వ్యూహరచన చేసింది. ఇందు కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద మంది ప్రత్యేక కార్యకర్తలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో పూర్తి సన్నద్ధతో తమ పాత్రను పోషించనున్నట్లు మోర్చా ప్రకటించింది. బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గెలుపొందడం పార్టీకి అతిపెద్ద ప్రాధాన్యత అన్నారు. గెలుపు ఆధారంగా మాత్రమే టికెట్లు ఇస్తారని.. కానీ, ఎన్నికల్లో గెలుపు తర్వాత సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించేలా పార్టీ హామీ ఇస్తుందన్నారు.
గత అసెంబ్లీ (2017) ఎన్నికల్లో సైతం బీజేపీ ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేదు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మొహసిన్ రజాను పార్టీలోకి తీసుకువచ్చి ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమశాఖ మంత్రిని చేసింది. యూపీలోని యోగి ప్రభుత్వ పథకాలన్నీ సమాజంలోని అన్ని వర్గాల కోసం ఉన్నాయన్న జమాల్.. పథకాల ప్రయోజనాలు అందించడంలో మతం, వర్గం, కులం, పేద, ధనిక, లింగబేధం చూపడం లేదన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, రేషన్ పథకం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాలు మైనారిటీ వర్గాలకు వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. 2014, 2019 లోక్సభ ఎన్నికలు, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ ముస్లిం అభ్యర్థులను పోటీలో నిలుపలేదు.