కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వద్దని అన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడిపై అభిషేక్ బెనర్జీ ఆదివారం స్పందించారు. ‘పాకిస్థాన్‌కు మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ లేదా సింబాలిక్ బెదిరింపులకు సమయం కాదు. వారు అర్థం చేసుకునే భాషలో వారికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఇది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి పొందే సమయం వచ్చింది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా, గత కొన్ని రోజులుగా ప్రధాన మీడియా తీరు, కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న వారి ప్రవర్తనను తాను నిశితంగా గమనిస్తున్నానని అభిషేక్ బెనర్జీ తెలిపారు. ‘పహల్గామ్ ఉగ్రదాడికి దారితీసిన లోపాలను లోతుగా పరిశోధించే బదులు, ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చే కథనాలను ముందుకు తీసుకురావడంపై ఎక్కువగా దృష్టి సారించారు. ఇలాంటి చిల్లర రాజకీయాల నుంచి మనం ఎదగాలి. ఈ సమస్యను ఒక్కసారిగా నిర్ణయాత్మకంగా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.