Serum Institute | దేశంలో పలు చోట్ల చోటుచేసుకున్న గుండెపోటు, ఇతర హృద్రోగ సంబంధ మరణాలకు కొవిడ్ వ్యాక్సినే (Covid vaccine) కారణమంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే (heart attack death concerns). ఈ విషయంపై కొవిషీల్డ్ తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India) తాజాగా స్పందించింది. టీకా, గుండె సంబంధిత మరణాల మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), ఎయిమ్స్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనాన్ని ఊటంకిస్తూ.. ‘టీకాలు సురక్షితమైనవి, శాస్త్రీయంగా ధృవీకరించబడ్డాయి’ అని స్పష్టం చేసింది.
దేశంలో పలు చోట్ల చోటుచేసుకున్న గుండెపోటు, ఇతర హృద్రోగ సంబంధ మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం బుధవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని హసన్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో 20 మంది గుండె సంబంధ సమస్యలతో మరణించడానికి కొవిడ్ వ్యాక్సినే కారణమంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన క్రమంలో కేంద్రం వివరణ ఇచ్చింది. ఇటీవల కర్ణాటకలోని హాసన్ జిల్లాలో పలువురు యువకులు హార్ట్ ఎటాక్‌తో మరణించారు. దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. కొవిడ్ టీకాను వేగంగా పంపిణీ చేయడం వల్లే అది జరుగుతుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చెస్ట్‌లో నొప్పి, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ఆసుపత్రిలో వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సీఎం ఆరోపణలతో ఆకస్మిక మరణాలకు కొవిడ్ టీకాలే కారణమంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్తంగా లోతైన అధ్యయనాన్ని చేపట్టాయి. ఈ పరిశోధనలో భాగంగా కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మరణించిన పలు కేసులను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా విశ్లేషించారు. వారి ఆరోగ్య నేపథ్యం, వ్యాక్సినేషన్ వివరాలు, ఇతర వైద్య సంబంధిత అంశాలను పరిశీలించారు. ఈ అధ్యయనంలో ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణం బాధితులకు ముందు నుంచే ఉన్న అనారోగ్య సమస్యలే అని తేలింది. దాదాపు నెలరోజులపాటూ జరిపిన ఈ అధ్యయనంలో జన్యుపరమైన లోపాలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలే కారణమని నిర్ధరణ అయ్యింది. వ్యాక్సిన్ల వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదని నివేదిక పేర్కొంది.
Also Read..
Hospital Collapses | కూలిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం.. ఇద్దరు మృతి